Thursday, June 2, 2016

క్రియాశూన్య ధూమపానం మరియు మద్యపానం

నేను దిగాల్సిన వికాస్ కాలని వచ్చింది, బస్సు దిగాను. ఎండ భీకరంగా వుంది; చాలా దాహంగా ఉంది. ఏమైన తాగితే బాగుంటుంది కదా అనుకొని అటు ఇటు తిరిగి చూసాను ఎక్కడా ఒక సోడా బండివాడో, కొబ్బరిబోండాలు అమ్ముకొనే వాడో కనిపించలేదు. కొంచెం దూరం నడిచాను ఏదైన కిరాణం కొట్టులాంటిది కనిపిస్తుందని ఇంతలోనే దారిలో డాడి వైన్స్ షాపు, దానిని ఆనుకొని పాన్ డబ్బ కనిపించాయి, హమ్మయ్య... ఇక్కడ వాటర్ బాటిల్ అయిన దొరుకుతుందని వెళ్ళాను. అక్కడికి వెళ్ళాగానే అదోరకమైన వాసన గుబాళింపుగా వచ్చింది. ఏం కావాలి సార్?.. అని అడిగాడు షాపతను. వాటర్ బాటిల్ కావాలన్నాను. ఇచ్చాడు. బాటిల్ మూతను తీస్తుండగా ఒకతను సిగరేట్ వెలిగించుకొని అక్కడే కొద్దిసేపుండి రెండుమూడు సార్లు ఊదాడు. ఎందుకో ఆ సిగరేట్ వాసనకి హాయిగా అనిపించింది. ఏంటబ్బ ఇలా అనిపిస్తుందనుకుంటుండగా ఒక తాగుబోతు రాయుడు తూలుతూ దగ్గరికి వచ్చి టైమ్ మ్ మ్..... ఎంతా? అని అడిగాడు. వాడు సగం తాగి సగం మీద పోసుకున్నట్టున్నాడు, ఒక్కసారిగా గుప్పుమని మందు వాసన వచ్చింది. రెండున్నర అన్నాను. అయితే ఓకే అని వెళ్ళిపోయాడు తూలుతూ. మరోసారి మందు వాసన గాఢంగా వచ్చింది. ఆ వాసనకి కాస్త మత్తుగా అనిపించింది. అది ఏంటో తేల్చూకోలేకపోతున్న. కొద్దిసేపటికి ఛీ... ఇలా చేస్తున్నానేంటి అనుకుని గట్టిగా ఉమ్మేసి, నోట్లో రెండు సార్లు నీళ్ళు పోసుకొని పుక్కిలించి ఉమ్మి, నీళ్ళు తాగాను. ఇంకొన్ని నీళ్ళు మిగిలాయి. చల్లగా ఉన్నాయి పాడేయడమెందుకని బాటిల్ తీసుకొని ఫ్రెండ్ రూంకి బయల్దేరాను.

ఫ్రెండ్ రూంకి చేరుకొని, డోర్ కొట్టాను. వాడు తలుపు తీసాడు. ముఖం చూసి, ఎండలు ఎలా ఉన్నాయిరా అన్నాడు. ఇంటికొస్తె నన్ను వదిలేసి ఎండల గురించి అడుగుతావేంట్రా అని అనుకుంటూ లోపలికి వెళ్ళాను.ఏంటి, రాజుగారు మినరల్ వాటర్ బాటిల్ కూడా వాడుతున్నారా అని వెటకారంగా అన్నాడు చేతిలో బాటిల్ చూసి.
"అదేం లేదురా, దాహం అయితే కొనుక్కొని తాగాన్రా..." అని అన్నాను.
"నువ్వు రిచ్ కిడ్ రా నీళ్ళు కూడా కొనుక్కొని తాగుతావురా" అన్నాడు.
"అరేయ్... ఇంకా ఆపుతావా... ఎందుకలా అయిందని నేను ఆలోచిస్తుంటే, నీ గోల నీదే" అన్నాను.
"ఏమైంది డార్లింగ్...? దేని గురించి ఆలోచిస్తున్నావు?" అన్నాడు.
"పాన్ డబ్బా దగ్గర సిగరెట్, లిక్కర్ వాసనకి మత్తుగా అనిపించిందిరా" అని జరిగిందంతా చెప్పాను.
"అహ్... అది సహజమే... మానవమాత్రులకు అది పరిపాటే" అని ఎన్టీఆర్ స్టైల్ లో అన్నాడు.
"ఏంటి సహజం, ఎవరికైన చెప్పుకుంటే ఎంత పరువు తక్కువ?" అన్నాను.
"యా... యూ ఆర్ రైట్" అన్నాడు.
"ఎందుకిలా అనిపించిందిరా" అని అడిగాను.
"ఇలా అనిపించడానికి కారణం క్రియాశూన్య ధూమపానం మరియు క్రియాశూన్య మద్యపానం" అని అన్నాడు.
"బాబు కాస్త అర్థమయ్యే విధంగా చెప్పురా" అన్నాను.
Passive Smoking
"ఓ... అయితే వినుకో. క్రియాశూన్య ధూమపానం అంటే ఒక వ్యక్తి ధూమపానం చేయకుండానే ఆ అనుభూతి పొందడమన్నా మాట. అదెలా అంటే, ధూమపానం చేస్తున్న వ్యక్తి సిగరెట్ వెలిగించినప్పుడు, సిగరెట్ మండుతున్న కొన నుండి వచ్చే పొగలో ధూమపానం చేసే వ్యక్తి పీల్చే రెండవ కొన నుండి వచ్చే పొగలో కంటే రసాయనాలు ఉంటాయి. ఎటువైపు నుంచి వచ్చే పొగలోనైన నికోటిన్ ఉంటుంది. అందుకే నువ్వు ఆ పొగను పీల్చగానే నీకు హాయిగా అనిపించింది."
"అంటే నేను పొగత్రాగినట్టేనా?"
"అవును, ఒక విధంగా అంతే" అని అన్నాడు.
"మందులో పొగలేదుగా, మరి క్రియాశూన్య మద్యపానం అంటే ఏంటి?"
"సాధారణంగా ఆల్కహాల్ ను నోటితో తీసుకున్నప్పుడు, అది జీర్ణాశయంలోకి వెళ్ళి జీర్ణక్రియ ద్వార రక్తంలో కలుస్తుంది. తద్వార మత్తెక్కుతుంది. ఆల్కహాల్ ఆవిరి అయ్యే స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాస్త వేడిగా ఉన్న గ్లాసులో మద్యం పోసి, జలుబు చేసినప్పుడు ఆవిరిపట్టినట్టుగా ఆవిరి పడితే ఆల్కహాల్ శ్వాసక్రియ ద్వార రక్తంలో కలిసిపోతుంది. ఈ ప్రక్రియ చాలా తొందరగా జరుగుతుంది. ఇదే విధంగా నువ్వు మద్యం వాసన పీల్చినప్పుడు నీకు మత్తుగా అనిపించింది. ఓక్కో సందర్బంలో ఆల్కహాల్ శరీరం మీద పడినప్పుడు చర్మ రంద్రాలు కేశనాళికలుగా పనిచేసి ఆల్కహాల్ నేరుగా రక్తంలో కలిసిపోతుంది."
"ఐతే ఈ లెక్కప్రకారం, బయట తాగి ఇంట్లోకి రాకండి కావాలంటే ఇంట్లోకి తెచ్చుకొని తాగండి అనే ఆడవాళ్ళు అమాయకులే అన్నమాట" అని అన్నాను
"అంతే కదా!"
"మరి ఇలా అయితే ఎలా రా...."
"అందుకే కదా బహిరంగ ధూమపాన నిషేధం మరియు మద్యపాన నిషేధం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది" అన్నాడు.
"ఏం లాభం ఎవరికి అర్థం కాదు కదా! కారు గొట్టంలోంచి రావట్లేదా, తాత చుట్టలోంచి రాలేదా? నా నోట్లోనుంచి వస్తే తప్పా అని వితండవాదం చేస్తారుగా" అన్నాను.
"ఒక సిగరేట్ వల్ల జరిగే వాయు కాలుష్యం, నిలకడలో వున్న డిజిల్ ఇంజన్ వల్ల జరిగే కాలుష్యం కన్న ఎక్కువ. నలుగురు కలిసి సిగరెట్ తాగినప్పుడు ఇంకా ఎక్కువ వాయు కాలుష్యం జరుగుతుంది. ఇక మన తాతల విషయానికి వస్తే, 1940వ సంవత్సరానికి ముందు వరకు కూడా మానసిక ఒత్తిడి తగ్గడానికి కొంత సమయం ధూమపానం చేయండి అని వైద్యులు సలహా ఇచ్చేవారు. కాని ఇప్పుడు ధూమపానం వల్ల కలిగే లాభాల కంటే నష్టాలే ఎక్కువని తెలుసుకొని ధూమపానం చేయవద్దని చెప్తున్నారు. విషయం పూర్తిగా తెలియని సమయంలో వాళ్ళు చేసింది సబబే. కాని తెలిసి కూడా అదే విషవలయంలో కూరుకుపోవాలనుకోవడం మన వ్రేళితో మన కంటిని మనమే పొడుచుకోవడం లాంటిది" అని అన్నాడు.
This would create lasting impression on the kid

ఇంకా వివరిస్తూ, "ధూమపానానికి, మద్యపానానికి ఏమిటి ప్రధాన కారణం అని ఆలోచిస్తే, క్రియాశూన్య ధూమపానం, మద్యపానమే కారణమనిపిస్తుంది. ఎందుకంటే ఇది సాధారణంగా సమాజంలో జరిగేదే, మంచికి చెడుకి తేడా తెలియని సమయంలో ఈ సంఘటన ఎదురైతే భవిష్యత్తు అధోగతి పాలవుతుంద"న్నాడు.
"ఏమోరా బాబు. మన వల్ల తోటి మనిషికి హాని జరుగుతుందని తెలిసి కూడా దాన్నే చేస్తుండడం కన్న మరో దౌర్భాగ్యం మానవ జాతికి లేదు" అని అన్నాను నిట్టూరుస్తూ.

No comments:

Post a Comment