Sunday, July 31, 2016

అంతా మంచే జరగాలి

రోజు రోజుకు నవీకరణ కాంతి వేగంతో దూసుకెల్తున్నది. కాని మానవుడు మాత్రం నైతికంగా ఇంకా దిగజారుతున్నాడు. మతం పేరుతో అల్లకల్లోలాలు సృష్ఠిస్తున్నాడు, అధికార దాహంతో విభేదాలు చూపిస్తున్నాడు, అసూయతోనూ ఓర్వలేనితనంతోనూ కుటుంబాలను బగ్గుమనిపిస్తున్నాడు.  21వ శతాబ్దంలో కంప్యూటర్ల రాకతో, యువత వినోదం మత్తులో పడి అసలు బాధ్యతను మరుస్తున్నారు. ఇవన్నీ కాక కొంతమంది మంచి చేస్తున్నామన్న భ్రమలో చెడుచేస్తున్నాడు. ఇవేకాక ఇలాంటివెన్నో కొత్త సంఘటనలు ప్రపంచంలో ఏదో ఒక మూలన జరుగుతున్నాయి. ఇలాంటి వార్తలు చదివినా, విన్నా, చూసినా ఏదోరకమైన బాధ, ఆవేదన మరియు విరక్తి కలుగుతాయి. ఎందుకు బాధ? నువ్వు బాగానే ఉన్నావు కదా! నీ ఇంట్లో వాళ్ళకి ఏం కాలేదుగా! నీ రాష్ఠ్రం కాదు, నీ దేశం కాదు. మరి ఎందుకు నీకీ ఆవేదనఎందుకంటే ప్రాంతీయ భావం, దేశీయ భావం కంటే గొప్పదైన మానవతా భావం నీలో ఉందిగనుక. మన చుట్టూవున్న నలుగురు బాగున్నప్పుడే మనం సంతోషంగా ఉండగలుగుతాము. అందరిలో సత్ప్రవర్తన కలగాలి, అందరు కలిసికట్టుగా ఉండాలి, ఏది ఏమైనకాని మనందరికి అంతా మంచే జరగాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలుగుతాము.
దృఢమైన సంకల్పంతో ఏదైన అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందని నేను నమ్ముతాను. కావున నేను కోరుకునేది ఒక్కటే అంతా మంచే జరగాలి, అందరికి మంచి జరగాలి. దానికి నేను ఎంచుకున్న మార్గాలివిఏ కార్యమైన మొదలుపెట్టే ముందు అంతా మంచే జరగాలని మనస్సులో అనుకొని సంకల్పించడమే. రోజులో ఒకమారైన అంతా మంచే జరగాలి అని ఏదొక పేపరు మీద వ్రాయడం; పేపరు అందుబాటులో లేకపోతే నేల మీదనో, బల్ల మీదనో, ఎడమ ఛాతి మీదనో లేదా గాలిలోనో వ్రాయడం; ప్రతివేళలో అంతా మంచే జరగాలి అని మననం చేసుకోవడం. ఇలా చేయడం వలన 'అందరికి మంచి జరగాలి' అనే భావం మనస్సులో బలంగా పాతుకుపోయి, మనం చేసే ప్రతికార్యం, మాట్లాడే ప్రతిమాట అందరికి మేలు చేసేవిధంగా పరిణామం చెందుతాయని నా విశ్వాసం. మన మనస్సులో మంచి ఆలోచనలు ఉన్నప్పుడు ఎదుటివాడికి కూడా మేలే చేస్తాము కదా!
అంతా మంచే జరగాలి అని రోజుకు ఒకసారైన వ్రాయడం మొదలుపెట్టాను.
మీరు కూడా అందరి మేలు కోరుకునే వారని తలచి మిమ్మల్ని ఒకటి అభ్యర్థించదలిచా. కుల, మత, భాష, దేశాలతో సంబంధం లేకుండా రోజులో ఒక్కసారైన "అంతా మంచే జరగాలి" అని మీకు నచ్చిన భాషలో మననం చేయడమో, వ్రాయడమో చేస్తారని కోరుకుంటున్నాను. నా అభ్యర్థన మీకు నచ్చితే 'సరే' లేదా 'చేస్తాను' అని క్రింద చిన్న వాఖ్య వ్రాయండి. సెలవు!

No comments:

Post a Comment